ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధిత సంస్థ 'సిక్స్ ఫర్ జస్టిస్' (ఎస్ఎఫ్ జే) తో సంబంధాలు కలిగిన పంజాబ్ పాలిటిక్స్ టీవీ పై కేంద్రం కొరడా ఝుళిపించింది.సదరు వార్తా సంస్థకు చెందిన వెబ్‌సైట్, యాప్‌లు, సోషల్ మీడియా అకౌంట్లను నిషేదించాలని మంగళవారం కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి నడుస్తున్న పంజాబ్ పాలిటిక్స్ టీవీ ఆన్ లైన్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలను ఎస్ఎఫ్ జే చేస్తున్నట్టు తెలిపింది.
ఈ ఛానెల్ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఐటీ నిబంధనల్లోని అత్యవసర అధికారాలను ఉపయోగించి వార్తా సంస్థపై నిషేధం విధించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.