కరోనా కేసుల విషయంలో హెచ్చరికలు జారీ చేసిన రాహుల్ గాంధీ
Centre being overconfident says Rahul Gandhi. కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 17 Feb 2021 2:00 PM GMTకరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే బ్రిటన్ రకం కరోనా దేశంలోకి ప్రవేశించగా.. తాజాగా దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకం కరోనా కూడా దేశంలోకి ప్రవేశించిందని కేంద్రం ప్రకటించింది. బ్రెజిల్ రకం కరోనా కేసు ఒకటి, దక్షిణాఫ్రికా రకం కరోనా కేసులు 4 నమోదైనట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ప్రకటించారు.దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ అతి విశ్వాసమే నష్టాన్ని కలిగించిందన్నారు. కరోనా ఇంకా పూర్తిగా పోలేదని హెచ్చరించారు. వీలైనంత జాగ్రత్తగా ఉండాలని రాహుల్ గాంధీ హెచ్చరిస్తూ వస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త కరోనా స్ట్రెయిన్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తోంది. కొత్త స్ట్రెయిన్లు చాలా ప్రమాదకరమని.. తొందరగా పాకే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు.
భారతదేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతదేశంలో గత 24 గంటల్లో 11,610 మందికి కరోనా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 11,833 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,37,320కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 100 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో భారతదేశంలో మృతుల సంఖ్య 1,55,913కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,44,858 మంది కోలుకున్నారు. 1,36,549 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 89,99,230 మందికి వ్యాక్సిన్ వేశారని అధికారులు వెల్లడించారు.