ఓ పక్క కరోనా వ్యాక్సినేషన్ జరుగుతూనే ఉంది, మరోపక్క ఎవరు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి అన్న విషయంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిపడా టీకాలు లేకపోవడం ఒక సమస్య అయితే, కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు ఎప్పుడు వాక్సిన్ వేసుకోవాలి, ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత కరోనా వస్తే రెండో డోస్ అసలు వేసుకోవాలా వద్దా ఇలాంటి చాలా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ విధానంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. కరోనా బారినపడి కోలుకున్నవారు కనీసం 3 నెలల తర్వాతే వాక్సిన్ తీసుకోవాలని తెలిపింది.
అలాగే మొదటి డోస్ వేసుకున్న తరువాత ఇన్ఫెక్షన్కు గురయ్యి కరోనా బారిన పడినా కూడా 3 నెలల వ్యవధి తర్వాత రెండవ డోసు తీసుకోవాలి అని చెప్పింది. అలాగే ప్లాస్మా ద్వారా చికిత్స పొందిన వారు కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల తర్వాత టీకా వేయించుకోవాలి. కోవిడ్ కాక ఇతర తీవ్ర వ్యాధులతో ఐసీయూలో ఉండి చికిత్స పొందినవారు కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత అంటే 2 నెలల తరువాత వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈ మేరకు కొవిడ్ 19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది.
గర్భిణీలకు వాక్సిన్ విషయం పై ఇంకా చర్చలు జరుగుతున్నాయన్న కేంద్ర ఆరోగ్యశాఖ బాలింతలు వ్యాక్సిన్ వేయించుకోవచ్చని చెప్పింది. అంతే కాదు కొవిడ్ నుంచి కోలుకున్నవారు, టీకా తీసుకున్నవారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయటంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పింది. అలాగే వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు అవసరం లేదంది.