'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై కమిటీ ఏర్పాటు
'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల వర్గాల ద్వారా తెలిసింది.
By అంజి Published on 1 Sept 2023 1:30 PM IST'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై కమిటీ ఏర్పాటు
'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల వర్గాల ద్వారా తెలిసింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నట్లు జాతీయ దినపత్రికలు రిపోర్ట్ చేశాయి. 1967 నాటి మాదిరిగానే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు దేశం తిరిగి ఎలా వెళ్లగలదో చూడడానికి ఈ కసరత్తు యొక్క సాధ్యాసాధ్యాలను, యంత్రాంగాన్ని కోవింద్ అన్వేషిస్తారని వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఆయన నిపుణులతో మాట్లాడతారని, వివిధ రాజకీయ పార్టీల నేతలను కూడా సంప్రదించవచ్చని భావిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ కమిటీ ఏర్పాటును ధృవీకరించారు. కమిటీ వేశామని, రిపోర్ట్ వస్తే చర్చిస్తామని జోషి చెప్పారు. పలు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికల అంశంపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ ప్రత్యేక సమావేశాల నిర్ణయం వెలువడినప్పటి నుంచి 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు వస్తుందని ఊహాగానాలున్నాయని, అయితే, ఈ విషయాన్ని ఏ ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించలేదు. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అంటే దేశవ్యాప్తంగా లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, భారతీయ జనతా పార్టీ కూడా పలుసార్లు ప్రస్తావించింది. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ఉంది. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.