మంకీపాక్స్‌పై కేంద్రం అలెర్ట్‌.. రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ

Central Govt issues advisory for states amid surge in global monkeypox cases. ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

By అంజి  Published on  14 July 2022 2:20 PM GMT
మంకీపాక్స్‌పై కేంద్రం అలెర్ట్‌.. రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ

ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌ హెచ్చరికలు జారీ చేస్తూ అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులకు లేఖ రాశారు. మంకీపాక్స్‌ విషయంలో అలర్ట్‌గా ఉండాలని, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంట్రీ గేట్ల దగ్గర హెల్త్‌ స్క్రీన్‌ టీమ్‌లను ఉంచాలని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరీక్షించాలని కోరారు.

ఆసుపత్రులలో పనిచేసే వైద్యులకు క్రమం తప్పకుండా రీ-ఓరియెంటేషన్ ఉండాలని భూషణ్ ఆదేశించారు. ఒక వేళ మంకీపాక్స్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలని, ఇన్ఫెక్షన్ నివారణ ప్రోటోకాల్‌ పాటించడంతో పాటు కాంటాక్ట్ ట్రేసింగ్ తప్పనిసరిగా చేపట్టాలన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ నుంచి కేరళకు వచ్చిన కొందరిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్‌ కేసు కూడా అధికారికంగా ధృవీకరించలేదు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో శాంపిళ్లను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపినట్లు కేరళ ఆరోగ్యశా మంత్రి వీణాజార్జ్‌ తెలిపారు. అలాగే ఆ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా 77 శాతం మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 6వేల మందికి మంకీపాక్స్‌ సోకింది. అదే సమయంలో ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో వైరస్‌ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మంకీపాక్స్‌ విస్తరణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 80శాతానికిపైగా కేసులు యూరప్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.


Next Story