వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న గ్యాస్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా వలస కూలీలకు ఇబ్బందులు కలగకుండా 5 కిలోల ఎఫ్‌టీఎల్ (Free Trade LPG) గ్యాస్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారికంగా లేఖ రాశారు. చమురు రంగ సంస్థల సమన్వయంతో, పౌరసరఫరాల శాఖ ద్వారా ఈ గ్యాస్ పంపిణీ సజావుగా సాగేలా చూడాలని ఆయన సూచించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యగా కేంద్రం 'ఛోటు' పేరుతో ఈ 5 కిలోల సిలిండర్లను అందుబాటులోకి తెచ్చింది. నగరాల్లో నివసించే వలస కార్మికులు ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ఈ కనెక్షన్లను సులభంగా పొందవచ్చు. ఈ నిర్ణయం వల్ల వలస కార్మికులు బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలకు గ్యాస్ కొనాల్సిన అవసరం ఉండదని, చమురు కంపెనీల ద్వారా రాష్ట్రాలకు అదనపు కోటాను అందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.