రాష్ట్ర పేరు మార్పుపై కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళ శాసనసభ జూన్ 24, 2024న ఏకగ్రీవంగా తీర్మానం చేసి, రాష్ట్రాన్ని అధికారికంగా 'కేరళం'గా పిలవాలని కేంద్రాన్ని కోరింది. అంతకుముందు 2023లో పంపిన తీర్మానాన్ని కొన్ని సాంకేతిక మార్పుల కోసం కేంద్రం వెనక్కి పంపగా, సవరణలు చేసి మళ్ళీ పంపారు.
మలయాళ భాషలో రాష్ట్ర పేరు 'కేరళం' అని ఉంటుందని, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న అన్ని భాషల్లోనూ 'కేరళ' స్థానంలో 'కేరళం' అని మార్చాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా, కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఈ మార్పును సమర్థిస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఇది కేరళ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో, రాజ్యాంగపరమైన సవరణల ద్వారా అధికారికంగా పేరు మార్పు ప్రక్రియ ముందుకు సాగనుంది.