గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో కరోనా ఉధృతి.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!
Center New Corona Guidelines. గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రం కొత్త మార్గదర్శకాలు.
By Medi Samrat Published on 16 May 2021 11:28 AM GMTగ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే..! మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ గ్రామాలపై ప్రభావం చూపిస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతూ ఉన్నారు. కరోనా కారణంగా ఎన్నో గ్రామాల్లో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల్లో కొవిడ్ కంటైన్మెంట్ నిర్వహణ మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ బాధితుల సేవలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని.. గ్రామీణ ప్రజల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా ఉంచాలని సూచించింది. ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని అన్నారు. సెకండ్ వేవ్ లో దాదాపు 85 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉండగా.. స్వల్ప లక్షణాల ఉన్నవారు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కరోనా రోగుల ఆక్సిజన్ స్థాయులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని.. ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్న వారిని ఆసుపత్రులకు తరలించాలని సూచించింది. ర్యాపిడ్ పరీక్షలపై ఏఎన్ఎం, సీహెచ్ఓలకు శిక్షణ ఇవ్వాలని, అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. గ్రామాల్లో ఆక్సీమీటర్లు, థర్మామీటర్లు అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఆక్సీమీటర్లు వాడిన ప్రతిసారి శానిటైజ్ చేయాలని వెల్లడించింది. ఆశా, అంగన్ వాడీ, వలంటీర్ల ద్వారా సేవలు అందించాలని తెలిపింది.
భారత్‌లో గత 24 గంటల్లో 3,11,170 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. అదే సమయంలో 3,62,437 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 4,077 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,70,284కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,07,95,335 మంది కోలుకున్నారు. 36,18,458 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.