సీడీఎస్ బిపిన్ రావ‌త్ చివ‌రి సందేశం విడుద‌ల‌.. ఆయ‌న ఏం మాట్లాడారంటే..?

CDS General Bipin Rawat's last message played at Swarnim Vijay Parv.తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Dec 2021 11:59 AM GMT
సీడీఎస్ బిపిన్ రావ‌త్ చివ‌రి సందేశం విడుద‌ల‌.. ఆయ‌న ఏం మాట్లాడారంటే..?

తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆక‌స్మిక మ‌ర‌ణ వార్త నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. డిసెంబ‌ర్ 8న త‌మిళ‌నాడు నీల‌గిరి ప‌ర్వ‌త‌శ్రేణుల్లోని కూనుర్ ప్రాంతంలో జ‌రిగిన హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో రావ‌త్ దంప‌తుల‌తో పాటు మ‌రో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. రావ‌త్ మ‌ర‌ణ‌వార్త‌తో యావ‌త్‌ దేశం విషాదంలోకి వెళ్లింది. వీరుడా సెల‌వంటూ క‌న్నీటి వీడ్కోలు ప‌లికింది. ఆయ‌న గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ ప్ర‌జానీకం మ‌రింత త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఆయ‌న చ‌నిపోవ‌డానికి కొన్ని గంట‌ల ముందు రికార్డు చేసిన ఓ వీడియోను.. రావ‌త్ చిట్ట చివ‌రి సందేశం అంటూ భార‌త ఆర్మీ ఆదివారం విడుద‌ల చేసింది.

1971వ సంవత్సరంలో పాకిస్థాన్‌పై యుద్ధంలో సాధించిన విజ‌యానికి గుర్తుగా ఢిల్లీలో నిర్వహించిన స్వ‌ర్ణిమ్ విజ‌య్ ప‌ర్వ్ కార్య‌క్ర‌మంలో రావ‌త్ చివ‌రి వీడియో సందేశాన్ని ప్ర‌సారం చేశారు. డిసెంబరు 7న రికార్డు చేసిన ఈ సందేశంలో భారత దేశంలోని సాయుధ దళాల సైనికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆ యుద్దంలో అమ‌రులైన సైనికుల‌కు నివాళుర్పించారు. ఆ యుద్దానికి 50 సంవ‌త్స‌రాలు పూర్తి అయిన సంద‌ర్భంగా డిసెంబరు 12 నుంచి 14 వరకు ఇండియా గేట్ వద్ద అనేక కార్యక్రమాలు జరుగుతాయని, ఇది చాలా గొప్ప విషయమన్నారు. మన సైనిక బలగాలు మనకు గర్వకారణమని, అందరం కలిసి విజయోత్సవాలను జరుపుకుందామని సీడీఎస్ బిపిన్ రావ‌త్ పిలుపునిచ్చారు.

1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత దేశ సైన్యం, నావికా దళం, వాయు సేన ఉపయోగించిన ఆయుధాలు దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శన శాలల్లో ఉన్నాయి. వీటిని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు తీసుకొచ్చి డిసెంబరు 12 నుంచి 14 వరకు ప్రదర్శిస్తారు. స్వర్ణిమ్ విజయ్ పర్వ్ పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తొలుత ఈ ఉత్స‌వాల‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని అనుకున్నా.. రావ‌త్ అకాల మ‌ర‌ణంతో నిరాడంబ‌రంగా జ‌రుపుతున్నారు. ఈ ఉత్సవాలను ప్రారంభించిన కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు.

1971లో జరిగిన ముఖ్యమైన యుద్ధ సంఘటనల గురించి ఈ ఉత్సవాల్లో ప్రజలకు దృశ్య, శ్రవణ విధానంలో వివరిస్తారు. ఈ ఉత్సవాల్లో సుమారు 40 మంది యుద్ధ వీరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు 'బుక్‌మైషో' యాప్ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. కానీ రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

Next Story