ఆ భావన తొలగించాలి.. సీబీఐని మందలించిన‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ శుక్రవారం తీవ్రంగా మందలించారు

By Medi Samrat  Published on  13 Sep 2024 9:36 AM GMT
ఆ భావన తొలగించాలి.. సీబీఐని మందలించిన‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ శుక్రవారం తీవ్రంగా మందలించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పును వెలువరిస్తూ.. కేజ్రీవాల్ అరెస్టు అన్యాయమని జస్టిస్ భూన్యా అన్నారు. పంజరంలో బంధించిన చిలుక అనే భావనను తొలగించాలని సీబీఐని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విమర్శించారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన సమయాన్ని ఆయన ప్రశ్నించారు, సీబీఐ అరెస్టు ఉద్దేశ్యం.. కేజ్రీవాల్‌ను జైలు నుండి బయటకు రాకుండా ఆపడమే అని అన్నారు.

జస్టిస్ భూయాన్‌ మాట్లాడుతూ.. 'సిబిఐ దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ. సిబిఐ నిష్పక్షపాతంగా కనిపించడమే కాకుండా.. దాని నిష్పక్షపాతతను ప్రశ్నించే అభిప్రాయాన్ని తొలగించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలి. చట్టబద్ధమైన పాలనలో ప్రజాస్వామ్యంలో అవగాహన ముఖ్యం అని ఆయన అన్నారు. సిబిఐ నిష్పక్షపాతంగా ఉండాలి. కొంతకాలం క్రితం ఇదే న్యాయస్థానం సీబీఐని ఖండించి.. పంజరంలోని చిలుకతో పోల్చింది. ఈ అభిప్రాయాన్ని సీబీఐ తొలగించడం ముఖ్యం అన్నారు.

పీఎంఎల్‌ఏ చట్టంలోని కఠినమైన నిబంధనల ప్రకారం.. కేజ్రీవాల్‌కు బెయిల్‌ లభించినప్పుడు.. అదే నేరానికి సంబంధించి సీబీఐ కస్టడీలోకి తీసుకోవడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నారు. 22 నెలల పాటు అప్పీలుదారుని (కేజ్రీవాల్) అరెస్టు చేయాల్సిన అవసరం లేదని సీబీఐ భావించింది. కానీ ఆయ‌న‌ ఈడీ కేసులో విడుదల అంచున ఉన్నప్పుడు.. అప్పీలుదారుని సీబీఐ హడావిడిగా అరెస్టు చేయడం అర్థం కాని విష‌యం అన్నారు.

ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ.. సీఎం కార్యాలయంలోకి ప్రవేశించకుండా.. ప్రభుత్వ ఫైళ్ళపై సంతకం చేయకుండా సుప్రీం కోర్టు షరతు విధించింది. ఈ షరతులపై జస్టిస్ భూయాన్‌ మాట్లాడుతూ.. ఇది ప్రత్యేక ఈడీ కేసు అయినందున న్యాయ క్రమశిక్షణ కారణంగా కేజ్రీవాల్‌పై విధించిన షరతులపై నేను వ్యాఖ్యానించను అని అన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ, దాని అమలుకు సంబంధించిన అక్రమాలు, అవినీతిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించడంతో 2022లో ఎక్సైజ్ పాలసీని రద్దు చేయడం గమనార్హం. సీబీఐ మరియు ఈడీ ప్రకారం.. ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు.. లైసెన్స్ హోల్డర్లకు అనవసరమైన ప్రయోజనాలు విస్తరించబడ్డాయి.

Next Story