కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు, ఎంపీ కార్తీ చిదంబరం నివాసం, కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం దాడులు చేపట్టింది. ముంబై, చెన్నై, ఒడిశా, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆయన కార్యాలయాలతో కలిపి మొత్తం తొమ్మిది చోట్ల సోదాలు జరుపుతోంది. చైనా కంపెనీలతో కార్తీ చిదంబరం లాలూచీ పడ్డారని, చైనీయులకు వీసాలు ఇప్పించడంలో లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. 2010 -14 మధ్య కాలంలో విదేశాల నుంచి కార్తీ చిదంబరం ఖాతాలకు నగదు బదిలీలు జరిగినట్టు సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. గతంలో ప్రాథమిక విచారణ మాత్రమే చేయగా, ఇప్పుడు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా.. ఈ తనిఖీలపై కార్తి వ్యంగస్త్రాలను గుప్పించారు. తమ ఇంట్లో సీబీఐ రికార్డుస్థాయిలో సోదాలు చేసి ఉంటుంది అంటూ విమర్శించారు. 'కౌంట్ మర్చిపోయా.. ఎన్నిసార్లు ఇలాంటి సోదాలు జరిగి ఉంటాయి..? బహుశా ఓ రికార్డు అయ్యి ఉంటుంది 'అని కార్తీ ట్వీట్ చేశారు.