సీబీఐ అదుపులో ఇద్దరు మంత్రులు.. ఎంట్రీ ఇచ్చిన సీఎం

CBI arrests two West Bengal ministers. పశ్చిమ బెంగాల్ చెందిన మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీల‌ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on  17 May 2021 8:14 AM GMT
CBI arrests two West Bengal ministers

పశ్చిమ బెంగాల్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఇన్ని రోజులూ ఎన్నికల్లో గెలుపుకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా చర్చించగా.. ఇప్పుడేమో కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్లుగా పరిస్థితులు తయారు అయ్యాయి. ప‌శ్చిమ బెంగాల్‌లో 2014 నాటి 'నారదా' కేసులో ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీల‌ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీలను సీబీఐ కార్యాలయానికి తరలించి సీబీఐ విచార‌ణ జరిపి.. వారిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు అనే వార్తలు గుప్పుమన్నాయి. సీబీఐ అధికారులు ఈ రోజు ఉదయం 8 గంటలకే మంత్రి ఫిర్హాద్‌ హకీం నివాసానికి చేరుకుని దాదాపు 20 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత సీబీఐ కార్యాలయానికి తరలించారు.ఈ నలుగురిపై సీబీఐ దర్యాప్తునకు గవర్నర్‌ జగదీప్‌ ధనకర్‌ అనుమతినిచ్చారు.

ఈ అరెస్ట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పద్ధతి అంటూ లేకుండా వారిని అరెస్ట్ చేశారని.. తననూ సీబీఐ అరెస్ట్ చేయాలన్నారు. ఇద్దరు మంత్రులు ఫర్హద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆమె కోల్ కతాలోని సీబీఐ ఆఫీసుకు వెళ్లారు. దాదాపు 45 నిమిషాలు అక్కడే ఉన్నారు. అరెస్ట్ లపై సీబీఐ ఆఫీసు ఎదుట తృణమూల్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

నారదా టేపుల విడుదల సమయంలో వీరంతా మంత్రులుగా ఉన్నారు. ఢిల్లీ జర్నలిస్టు ఒక‌రు తృణమూల్‌ నేతలపై స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించడం అప్పట్లో కలకలం రేపింది. ఏడుగురు తృణమూల్‌ ఎంపీలతో పాటు నలుగురు మంత్రులు, ఒక ఎమ్మెల్యే, పోలీసు అధికారి నగదు తీసుకుంటూ కెమెరాకు చిక్కారు.


Next Story