భారత్‌లో హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు.. ఆఫీసుల్లో మాస్కులు షురూ!

హెచ్‌ఎంపీవీ భారత్‌లో ప్రవేశించడంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి.

By అంజి  Published on  6 Jan 2025 1:51 PM IST
HMPV virus, India, Masks

భారత్‌లో హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు.. ఆఫీసుల్లో మాస్కులు షురూ!

హెచ్‌ఎంపీవీ భారత్‌లో ప్రవేశించడంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి. కార్పొరేట్‌ కార్యాలయాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు మాస్కులు ధరించేలా యాజమాన్యాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. జనాల తాకిడి ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇకపై మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు. బెంగళూరులో ఇవాళ ఒక్కరోజే రెండు హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కాగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ ఎప్పట్నుంచో ఉనికిలో ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్‌ గుండూరావు తెలిపారు. బెంగళూరులో వైరస్‌ సోకిన ఇద్దరికీ ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ హిస్టరీ లేదని గుర్తు చేశారు. అందుకే ఫస్ట్‌ కేసు అంటూ తప్పుదోవ పట్టించొద్దని కోరారు. దీనికి దగ్గు, జలుబు వంటి సాధారణ లక్షణాలే ఉంటాయన్నారు. చైనాలో వ్యాపిస్తున్నది హెచ్‌ఎంపీవీ కొత్త వేరియంట్‌ అని తెలిసిందన్నారు.

అటు గుజరాత్‌లో తొలి హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసు నమోదైనట్టు సమాచారం. అహ్మదాబాద్‌ చాంద్‌ఖేడాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పేషెంట్‌ చేరినట్టు ఏబీపీ అస్మిత న్యూస్‌ తెలిపింది. ఆ చిన్నారి వయస్సు రెండేళ్లని పేర్కొంది. దీంతో దేశంలో ఈ కేసుల సంఖ్య మూడుకు చేరుకున్నట్టైంది. బెంగళూరులో మూడు, ఎనిమిది నెలల చిన్నారులకు హెచ్‌ఎంపీవీ సోకినట్టు ఐసీఎంఆర్‌ ఇవాళ ధ్రువీకరించింది. చిన్నారులపై ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది.

Next Story