Video: ఆసుపత్రి డీన్‌తో టాయ్‌లెట్‌ శుభ్రం చేయించిన ఎంపీ.. కేసు నమోదు

మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రి డీన్‌తో టాయిలెట్ శుభ్రం చేయించినందుకు శివసేన ఎంపీ హేమంత్ పాటిల్‌పై కేసు నమోదైంది.

By అంజి  Published on  4 Oct 2023 6:44 AM GMT
Shiv Sena MP Hemant Patil , Nanded hospital , 	toilet clean, Maharashtra

Video: ఆసుపత్రి డీన్‌తో టాయ్‌లెట్‌ శుభ్రం చేయించిన ఎంపీ.. కేసు నమోదు

ఆసుపత్రిలో 48 గంటల్లో 31 మంది రోగులు మరణించిన వివాదం నేపథ్యంలో నాందేడ్ ఆసుపత్రి డీన్‌తో టాయిలెట్ శుభ్రం చేయించినందుకు శివసేన ఎంపీ హేమంత్ పాటిల్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని, పరువు తీశారనే ఆరోపణలపై యాక్టింగ్ డీన్ ఎస్ ఆర్ వాకోడ్ ఫిర్యాదు మేరకు బుధవారం పాటిల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఎంపీ.. వాకోడ్‌కు చీపురు అందజేసి, మురికిగా ఉన్న టాయిలెట్‌ను, గోడకు అమర్చిన మూత్రశాలలను శుభ్రం చేయిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన వీడియో చూపించింది.

వాకోడ్ ఫిర్యాదు మేరకు, బుధవారం ఉదయం పాటిల్‌తో పాటు మరో 10-15 మందిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి), 500 (పరువు నష్టం), 506 (నేరపూరిత బెదిరింపు), అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని నిబంధనలు కింద ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయబడింది

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల 48 గంటల్లో 31 మంది మరణించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆసుపత్రికి ముఖ్యమంత్రి పర్యటనకు ముందు ఆసుపత్రికి చేరుకున్న పాటిల్ మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించారు. దానిని శుభ్రం చేయాలని ఆసుపత్రి డీన్‌ను కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తన పరువు తీశారని డీన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story