మొదటిసారిగా సీఆర్పిఎఫ్ లో కానిస్టేబుల్ నియామక పరీక్షను హిందీ, ఇంగ్లీష్ సహా 13 ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 128 నగరాల్లో 48 లక్షల మంది అభ్యర్థులకు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7, 2024 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో, జనవరి 01, 2024 నుండి హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షను నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి అమిత్ షా చొరవతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబడింది.
కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్ష ఇప్పుడు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషలతో పాటు హిందీ, ఇంగ్లీషు భాషలలో అభ్యర్థులు రాయవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ప్రధాన పరీక్షల్లో కానిస్టేబుల్ (GD) ఒకటి, దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు ఇది ఉపయోగపడుతుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో, దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత తమ మాతృభాషలో ఈ పరీక్ష రాయవచ్చు, ఇది వారి ఎంపిక అవకాశాలను పెంచుతుంది.