కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఇవ్వడం కుదరదు
Can't pay Rs 4 lakhs ex gratia amount to Covid-19 victims.కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2021 2:57 PM ISTకరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించలేమని కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. అలా ఇస్తే.. కొవిడ్ సహాయక నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని తెలిపింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులకు మాత్రమే పరిహారం ఉంటుందని, కొవిడ్ బాధితులకు రూ.4 లక్షలు ఇవ్వడం కుదరదని కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. కరోనా మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిష్లపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపింది.
భారత్‌లో కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది చనిపోయారు. ఈ నాలుగు లక్షల బాధిత కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి వస్తే.. మొత్తం ఎన్‌డీఆర్ఎఫ్ నిధులన్నీ వాటికే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ అలాచేస్తే.. రాష్ట్రాలు కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా అత్యవసర మందులు, ఇతర కొనుగోళ్లతోపాటు తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టమవుతుందని స్పష్టం చేసింది. కేవలం వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరిత్యాలకు మాత్రమే విపత్తు సహాయం వర్తిస్తుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.