మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా

Calcutta HC fines Mamata Banerjee RS 5 Lakh.పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కోల్‌క‌తా హైకోర్టు షాక్ ఇచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2021 12:40 PM IST
మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కోల్‌క‌తా హైకోర్టు షాక్ ఇచ్చింది. బీజేపీతో న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందాకు సంబంధాలున్నాయని ఆరోపించినందుకుగాను మమతాబెనర్జీకి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. న్యాయవ్యవస్థను చెడుగా చిత్రీకరించినందుకు జరిమానా విధిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. మమతా బెనర్జీ దరఖాస్తును జస్టిస్ చందా తిరస్కరించారు. తాను వ్యక్తిగత అభీష్టానుసారం కేసు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని చెపుతూ కేసును తన బెంచ్ నుంచి విడుదల చేశారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే..?

నందిగ్రామ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన మమతాబెనర్జీ.. ఎన్నికల్లో, ఓట్ల లెక్కింపులోనూ అక్రమాలు జరిగాయని, కావున సువేందు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ కౌశిక్ చందా విచారణ చేపట్టారు. ఈ పిటిషన్ ప్రజా ప్రాతినిధ్యం చట్టం-1951కి అనుగుణంగా వేశారా లేదా అనే విషయమై ఓ నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ కు జడ్జి కౌశిక్ ఆదేశాలు కోరారు. ఈ క్రమంలోనే మమతా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ జడ్జిని తన కేసు విచారించకుండా చూడాలని.. ఆయనకు బీజేపీ నేపథ్యం ఉందని చీఫ్ జస్టిస్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

దీంతో ఆ కేసుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఆ కేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు జ‌డ్జి కౌశిక్ చందా తెలిపారు. అయితే ఆ కేసును విడిచిపెట్టే ముందు ఆయ‌న మ‌మ‌తా బెన‌ర్జీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌డ్జికి క‌ళంకం తెచ్చే విధంగా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ముంద‌స్తుగా ప్ర‌ణాళికి వేసుకున్న‌ట్లు కౌశిక్ ఆరోపించారు. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన విధుల‌ను ఆమె ఉల్లంఘించిన‌ట్లు జ‌డ్జి పేర్కొన్నారు.

Next Story