ఇకపై మహిళల కనీస వివాహ వయసు 21ఏళ్లు..!
Cabinet clears push to raise marriage age of women from 18 to 21.పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సు
By తోట వంశీ కుమార్ Published on 16 Dec 2021 5:55 AM GMTపురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సు పెంచే ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు అమ్మాయిలకు కనీస వివాహా వయస్సు 18 ఏళ్లు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు పెంచుతూ నిన్నకేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో అబ్బాయిల వివాహా వయస్సు 21 కాగా.. అమ్మాయి వయస్సు 18గా ఉంది. అయితే.. దీనిపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. 18 ఏళ్లకే అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం వల్ల వారి కెరీర్ దెబ్బతినడంతో పాటు చిన్న వయస్సులోనే గర్భం దాల్చడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని అందుకనే వారి వివాహా వయస్సును కూడా 21 సంవత్సరాలకు పెంచాలని, అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఉన్న ఈ అంతరాన్ని తొలగించాలని అభ్యర్థనలు వెల్లువెత్తాయి.
గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని మోదీ ప్రస్తావించారు. పౌష్టికాహార లోపం నుంచి ఆడపిల్లలను రక్షించాలంటే వారికి సరైన సమయంలో పెళ్లి చేయాలన్నారు. ఇందుకోసం గతేడాది జూన్‌లోనే నీతిఆయోగ్, టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు దేశ వ్యాప్తంగా సర్వేలు చేపట్టాయి. వాటన్నింటినీ పరిశీలించి ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేసింది. మహిళలు మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్ కీలక సూచన చేసింది. 21 ఏళ్లకు పెళ్లి చేయడం అది కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్య పరంగా సానుకూలం ప్రభావం చూపుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టంలో సవరణలు తీసుకొచ్చి దానికి ఒక రూపం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.