ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించనున్న 'బురేవి' తుఫాను

Burevi cyclone effect .. తమిళనాడు: 'బురేవి' తుఫాను అల్లకల్లోలం సృష్టించనుంది. రాష్ట్రంలోని సముద్ర తీరం

By సుభాష్  Published on  4 Dec 2020 3:49 AM GMT
ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించనున్న బురేవి తుఫాను

బురేవి తుపాన్‌ రూపంలో రాష్ట్రంలోని సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. పాంబన్‌, మండపం, ధనుష్కోటీ తీరాల్లో తుఫాను ధాటికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. శుక్రవారం ఈ తుఫాను తీరం దాటిన అనంతరం కూడా రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు తెలిపారు. సెంబరంబాక్కం గేట్లను సైతం తెరిచారు. అడయార్‌ నదీ తీరం వాసులను అప్రమత్తం చేశారు. తుఫాను కారణంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బంగాళాఖాతంలో నెలకొన్న బురేవి తుఫాను బుధవారం శ్రీలంకలోని త్రికోణమలై వద్ద తీరాన్ని తాకింది. అక్కడ విలయతాండవం చేసిన ఈ తుఫాను గురువారం మన్నార్‌వలిగుడా మీదుగా తమిళనాడు సరిహద్దుల వైపు కదిలింది. ముందు పాంబన్‌కు 110 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉండటంతో నాగపట్నం, తిరువారూర్‌, తంజావూరు డెల్టా జిల్లాల్లో, దిండుగల్‌, నీలగిరి, తేని కొండ ప్రాంతాల్లో నిండిన జిల్లాల్లో, కడలూరు,విల్లుపురం, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఈ బురేవి తుఫాను కారణంగా చెన్నై నుంచి కన్యాకుమారి వరకు సముద్ర తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అనేక ప్రాంతాల్లోని గ్రామాల్లోకి సముద్రపు నీరు వచ్చే పరిస్థితి నెలకొంది.

ఈ ఐదు జిల్లాల్లో..

బురేవి తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది.తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. ముందు జాగ్రత్తతో తీవ్ర నష్టాన్ని తప్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముందస్తుగా అప్రమత్తమై సహాయక బృందాలను రంగంలోకి దింపారు.

ఆ మూడు ప్రాంతాల్లో కల్లోలమే..

శ్రీలంకను దాటి మళ్లీ తమిళ భూభాగాన్ని తాకేందుకు బురేవి తుఫాను కదలికలు ఉండటంతో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రామేశ్వరం, మండపం, పాంబన్‌ సముద్ర తీరాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం, సముద్రంలో అలల తాకిడి భారీగా ఉండటం ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ముంస్తుగానే తీరవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఎలాంటి నష్టం ఎదురవుతుందోననే ఆందోళన వ్యక్తం అవుతోంది. సముద్ర తీరంలోని చెక్‌పోస్టులు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాంబన్‌ తీరంలో చిక్కుకున్న కొందరు జాలర్లను సురక్షితంగా రక్షించారు.

Next Story