రైతులకు నిర్మలా సీతారామన్ మరో గుడ్‌న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని ప్రకటించారు. ఈ కార్డులతో లభించే స్వల్ప కాలిక రుణాలతో 7.7 కోట్ల మంది రైతులు, జాలరులు, పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలపై మాట్లాడారు. బడ్జెట్‌లో ముఖ్యంగా రూరల్ ఎకానమీపై భారీగా ఫోకస్ పెట్టారు. 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు.
రాష్ట్రాలతో కలిసి దేశ వ్యాప్తంగా పీఎం కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్‌ను ఆరంభిస్తున్నట్టు తెలిపారు. తక్కువ ఉత్పత్తి, తక్కువ రుణాలు దొరికే 100 జిల్లా రైతులకు ఇది లబ్ధి చేకూరుస్తుందన్నారు. పంచాయతీల స్థాయిలో మౌలిక సదుపాయాలు నెలకొల్పుతామన్నారు. తక్కువ దిగుబడి, మితమైన పంట తీవ్రత, సగటు కంటే తక్కువ రుణ సదుపాయం ఉన్న 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రకటించారు. పంట వైవిధ్యీకరణ, మెరుగైన నీటిపారుదల మరియు మెరుగైన నిల్వ సౌకర్యాల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం ద్వారా ఈ పథకం 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.