58వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్న బీఎస్‌ఎఫ్
BSF celebrates 58th Foundation Day. భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) గురువారం 58వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది.
By అంజి Published on 1 Dec 2022 11:00 AM GMTభారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) గురువారం 58వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ బీఎస్‌ఎఫ్ జవాన్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు. బీఎస్ఎఫ్ స్థాపన దినం సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలను చెప్పారు. భారతదేశాన్ని రక్షించడంలో, దేశ ప్రజలకు ఆపద సమయంలో సేవలను అందించడంలో బీఎస్ఎఫ్‌కు విశిష్టమైన ట్రాక్ రికార్డు ఉందని ప్రధాని మోదీ అన్నారు. 1965 డిసెంబర్ 1న బీఎస్‌ఎఫ్ స్థాపన జరిగింది.
డేటా ప్రకారం.. ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకు సరిహద్దు ప్రాంతాల నుండి పారా మిలటరీ దళం 26,000 కిలోల కంటే ఎక్కువ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో దేశం పంచుకునే 6386.36 కి.మీ సరిహద్దులను బీఎస్ఎఫ్ కాపాడుతోంది.
సమాచారం ప్రకారం.. ఈ సరిహద్దుల వద్ద చొరబాట్లు కాకుండా, సరిహద్దు ప్రాంతాల్లో డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్‌ను నిరోధించడానికి ఫోర్స్ నిరంతర కార్యకలాపాలు చేస్తోంది. భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, నకిలీ నోట్లు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్ అక్టోబర్ చివరి వరకు 26,469.943 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఇందులో వెస్ట్రన్ ఫ్రంట్‌లో 518.272 కిలోలు, ఈస్టర్న్ ఫ్రంట్‌లో 25,951.671 కిలోలు ఉన్నాయి.
సరిహద్దులో భారీగా నకిలీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది కాకుండా 72 రకాల ఆయుధాలు, 2441 రకాల మందుగుండు సామగ్రిని బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. అక్టోబరు 2022 వరకు బీఎస్‌ఎఫ్ 4174 మందిని అరెస్టు చేసింది. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టులపై నిఘా పెట్టెందుకు బీఎస్‌ఎఫ్ మోహరించింది. నవంబర్ 1, 2021 నుండి అక్టోబర్ 31, 2022 వరకు బీఎస్‌ఎఫ్ 9 మంది హార్డ్ కోర్ మావోయిస్టులు, 823 మిలీషియాలను అరెస్టు చేసింది.
అదే సమయంలో ఈ రెండు రాష్ట్రాల్లోని దట్టమైన అడవుల్లో 48 ఐఈడీలను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి 864 జిలెటిన్ స్టిక్స్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ప్రకారం.. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ కింద కాంగోలో సుమారు 140 మంది బీఎస్‌ఎఫ్ జవాన్లు మోహరించారు. అక్కడ దాడిలో ఇద్దరు మరణించారు.
బీఎస్‌ఎఫ్ సంస్థలో 7,000 మందికి పైగా మహిళలు ఉన్నారు. నవంబర్ 28న పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. భారతదేశ సరిహద్దులను రక్షించడానికి, అంతర్జాతీయ నేరాలను నిరోధించడానికి 1965 లో బీఎస్‌ఎఫ్ స్థాపించబడింది. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలోనూ బీఎస్‌ఎఫ్ ముఖ్యమైన పాత్ర పోషించింది.