మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష.. గతంలోనే ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తిన ఓవైసీ.. పట్టించుకోని కేంద్రం

ఖతార్‌లో ఏడాది పాటు నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందికి ఖతార్‌లోని కోర్టు గురువారం మరణశిక్ష విధించింది.

By అంజి  Published on  27 Oct 2023 2:46 AM GMT
ex Navy officials, Qatar, Asaduddin Owaisi,PM Modi

మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష.. గతంలోనే ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తిన ఓవైసీ.. పట్టించుకోని కేంద్రం

ఖతార్‌లో ఏడాది పాటు నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందికి ఖతార్‌లోని కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. తీర్పుపై స్పందించిన భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.సాధ్యమయ్యే అన్ని చట్టపరమైన చర్యలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. "మరణశిక్ష యొక్క తీర్పుతో మేము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. వివరణాత్మక తీర్పు కోసం ఎదురుచూస్తున్నాము. మేము వారి కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సన్నిహితంగా ఉన్నాము. మేము అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నాము" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

"మేము ఈ కేసుకు అధిక ప్రాముఖ్యతనిస్తాము. దానిని నిశితంగా అనుసరిస్తున్నాము. మేము అన్ని కాన్సులర్, చట్టపరమైన సహాయాన్నికోరాం. మేము ఖతార్ అధికారుల తీర్పును కూడా అందించాం" అని పేర్కొంది. భారత విదేశాంగ శాఖ.. దాని ప్రకటనలో ప్రొసీడింగ్స్ యొక్క గోప్య స్వభావాన్ని కూడా అంగీకరించింది. ప్రస్తుతానికి తదుపరి వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఆగస్టు 2022లో ఖతార్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ఎనిమిది మంది మాజీ భారత నేవీ అధికారులను ఖతార్ అదుపులోకి తీసుకుంది.

భారత నేవీ మాజీ అధికారులు - కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, నావికుడు రాగేష్‌లను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆగస్టు 30,2022 నాడు అరెస్టు చేసింది. నేవీ వెటరన్‌ల బెయిల్‌ను ఖతార్ అధికారులు చాలాసార్లు తిరస్కరించారు. మరణశిక్షను ఖతార్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్ట్ అంతకుముందు రోజు ప్రకటించింది.

ఇజ్రాయెల్ తరపున జలాంతర్గామి కార్యక్రమానికి సంబంధించిన గూఢచర్యం ఆరోపణలను నేవీ అనుభవజ్ఞులు ఎదుర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఖతార్ అధికారులు అదనంగా పేర్కొన్నారు.

ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ అధికారులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెనక్కి తీసుకురావాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ గురువారం డిమాండ్ చేశారు. మాజీ నావికాదళ అధికారులు మరణ శిక్ష విధించడం చాలా దురదృష్టకరమని హైదరాబాద్ ఎంపీ అన్నారు. ఖతార్‌లో చిక్కుకున్న మాజీ నావికాదళ అధికారుల సమస్యను ఆగస్టులో లేవనెత్తినట్లు ఒవైసీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

“ఈరోజు వారికి మరణశిక్ష విధించబడింది. ఇస్లామిక్ దేశాలు తనను ఎంతగా ప్రేమిస్తున్నాయని నరేంద్ర మోదీ గొప్పలు చెప్పుకున్నారు. అతను మన మాజీ నావికాదళ అధికారులను తిరిగి తీసుకురావాలి. వారు మరణశిక్షను ఎదుర్కోవడం చాలా దురదృష్టకరం” అని ఆయన అన్నారు.

Next Story