తొలిసారి సెంచరీ కొట్టిన పెట్రోల్.!
Branded petrol crosses Rs 100-mark in Rajasthan. దేశ చరిత్రలోనే పెట్రోల్ ధర తొలిసారి సెంచరీ కొట్టింది.
By Medi Samrat
న్యూఢిల్లీ : దేశ చరిత్రలోనే పెట్రోల్ ధర తొలిసారి సెంచరీ కొట్టింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.101.15కు పెరిగింది. దేశంలో కొద్ది రోజులుగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. బుధవారం కూడా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల చొప్పున పెరిగాయి. దీంతో రాజస్థాన్‌లో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర రూ.101.15కు, సాధారణ పెట్రోల్ ధర రూ.98.40కు పెరిగింది.
తాజా ధరల పెంపుతో ఢిల్లీలో సాధారణ పెట్రోల్ రేటు రూ. 86.30కు, లీటర్ డీజిల్ ధర రూ. 76.23కు పెరిగింది. కరోనా లాక్‌డౌన్‌లను సడలించిన నాటికి, నేటికీ పెట్రో ధరల్లో ఎంతో వ్యత్యాసం. ఒక్క జనవరి నెలలోనే ఇప్పటికి ఏడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గత ఏడాది జూన్ ఆరో తేదీ నాటికి పెట్రోల్ ధర రూ.74.21, డీజిల్ ధర రూ.63.15 ఉంది.. జూన్ 19 నాటికి పెట్రోల్ ధర రూ. 81.36, డీజిల్ ధర రూ.75.36కు అమాంతం ఎగబాకింది. అది క్రమంగా పెరుగుతూ కొత్త సంవత్సరారంభంలో పెట్రోల్ ధర రూ.91.21కి, డీ జిల్ ధర రూ.84.40కి పెరిగిపోయింది.
ఇదిలావుంటే.. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను చూసి వినియోగదారులు ఠారెత్తిపోతున్నారు. కరోనా అనంతరం ఉద్యోగులు, ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లేవారు సొంత వాహనాల మీదనే ఆధారపడాల్సి వచ్చింది. వాహనాలు లేని వారు అప్పు చేసి పాత వాహనాలను కొనుగోలు చేసి ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు నింగినంటుతుండటంతో వాహనదారుల గుండె గుభేల్ మంటోంది.