ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
కొచ్చి నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానానికి సోమవారం బాంబు బెదిరింపు రావడంతో
By Medi Samrat Published on 28 Aug 2023 4:15 PM ISTకొచ్చి నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానానికి సోమవారం బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందడంతో.. విమానంలోని మొత్తం 139 మంది ప్రయాణికులను కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో దించేశారు. సమాచారం ప్రకారం.. 6E6482 నంబరు గల విమాన సర్వీసు ఉదయం 10.30 గంటలకు బెంగుళూరుకు వెళ్లాల్సి ఉండగా బెదిరింపు వచ్చింది.
కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (CIAL) ఫ్లైట్ టేకాఫ్ అవ్వబోతుండగా.. విమానాశ్రయంలోని CISF కంట్రోల్ రూమ్‌కి.. బెంగళూరుకు విమానానికి సంబంధించి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న ప్రయాణీకులందరినీ డీబోర్డు చేశామని.. తదుపరి తనిఖీల కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించామని వారు తెలిపారు.నెడుంబస్సేరి పోలీసులు కూడా బాంబు బెదిరింపు కాల్ అందుకున్నామని ధృవీకరించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక బృందాన్ని పంపినట్లు చెప్పారు.
బెదిరింపు కాల్ వచ్చిన సమయంలో విమానంలో 138 మంది ప్రయాణికులు, ఓ చిన్నారి ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది అందరినీ భద్రతా ప్రాంతానికి తరలించారు. దాదాపు మధ్యాహ్నం 1 గంటల వరకు బ్యాగేజీని తిరిగి పరీక్షించడం జరిగింది. అనుమానాస్పదంగా ఏమీ కనబడలేదని తెలిపారు. కేసు నమోదు చేసి కాల్ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకోవాడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.