కోడెర్మాలోని జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నీరా యాదవ్ నివాసం వద్ద శనివారం అర్థరాత్రి బాంబు పేలిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే నీరా యాదవ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఎమ్మెల్యే నివాసం వెలుపల జరిగిన పేలుడు సమాచారం మేరకు స్థానిక పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే పేలుడు జరిగిన ప్రదేశానికి కొద్ది అడుగుల దూరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. తన యోగ క్షేమాలు తెలుసుకోవడానికి వచ్చిన కార్యకర్తలతో నీరా యాదవ్ మాట్లాడారు.
పోలీసుల అదుపులో వ్యక్తి
ఎమ్మెల్యే నివాసంపై బాంబు దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ కేసులో మహావీర్ మొహల్లాకు చెందిన శివ నందన్ యాదవ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. మద్యం మత్తులో అతడు బాంబు వేసినట్లు కోడెర్మ ఎస్పీ కుమార్ గౌరవ్ తెలిపారు. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కాగా.. ఈ మొత్తం ఘటనపై ఎమ్మెల్యే నీరా యాదవ్ సమాచారం ఇస్తూ ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు.