ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం.. ఠాక్రే కోటకు బీటలు
శుక్రవారం (జనవరి 16, 2026) మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.
By - అంజి |
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం.. ఠాక్రే కోటకు బీటలు
శుక్రవారం (జనవరి 16, 2026) మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ సంస్థగా పేరున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)పై థాక్రే కుటుంబం దశాబ్దాల ఆధిపత్యానికి తెరపడింది. తాజాగా జరిగిన బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన (శిందే వర్గం) కూటమి ఘన విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఈ ఫలితాలతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర రాజకీయాల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మోమెంట్’గా అవతరించారు.
బీజేపీకి రికార్డు విజయం
మొత్తం 227 వార్డులున్న బీఎంసీలో బీజేపీ 89 సీట్లు గెలుచుకుని 2017లో సాధించిన 82 సీట్ల రికార్డును దాటింది. ముంబైలో బీజేపీ మిత్రపక్షమైన శివసేన (ఏకనాథ్ శిందే వర్గం) 29 సీట్లు గెలుచుకుంది. దీంతో కూటమి మొత్తం బలం 118కి చేరి, అవసరమైన మెజారిటీ (114)ని సులభంగా దాటింది. ఈ విజయం నగర రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని మరింత బలపరిచినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా నగరంలోని ఆర్థిక వనరులు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పుడు బీజేపీ కీలక పాత్ర పోషించనుంది.
శివసేన (శిందే) బలహీనతలు బహిర్గతం
అయితే ఈ ఫలితాలు ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ శిందేకు కొంత నిరాశను మిగిల్చాయి. 2017లో అవిభక్త శివసేనకు చెందిన 84 కార్పొరేటర్లలో ఎక్కువమంది తనవైపే ఉన్నప్పటికీ, ఈసారి ఆయన వర్గం కేవలం 29 సీట్లకే పరిమితమైంది. శివసేన సంప్రదాయ ఓటుబ్యాంకును నిలుపుకోవడంలో శిందే వర్గం ఇబ్బందులు పడుతోందని ఫలితాలు స్పష్టం చేశాయి. అయితే, ఏకనాథ్ శిందే మాత్రం ఫలితాలను స్వాగతిస్తూ, ఇది “అభివృద్ధికి, అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన మాండేట్” అని వ్యాఖ్యానించారు. గత మూడున్నరేళ్లుగా మహాయుతి ప్రభుత్వం పనితీరుకు ఇది ప్రజల మద్దతుగా పేర్కొన్నారు. కొత్త బీఎంసీ మేయర్ ఎవరు అనే ప్రశ్నకు మాత్రం “మహాయుతి నుంచే ఉంటారు” అంటూ సమాధానం దాటవేశారు.
ఉద్ధవ్ శివసేనకు ఎదురుదెబ్బ
ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన 65 సీట్లకే పరిమితమైంది. ఇది 2017లో అవిభక్త శివసేన సాధించిన 84 సీట్లతో పోలిస్తే గణనీయమైన పతనం. అయినప్పటికీ, పార్టీ చిహ్నం కోల్పోయినా, కార్యకర్తల విభజన జరిగినా, థాక్రే రాజకీయ వారసత్వం ఇంకా పూర్తిగా అంతమవలేదని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.
హిందుత్వం వర్సెస్ మరాఠీ అస్మిత
ఎన్నికల సమయంలో రాజకీయ పోరు హిందుత్వ అజెండా వర్సెస్ మరాఠీ అస్మితగా మారింది. కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నంలో ఉద్ధవ్ థాక్రే తన బంధువు రాజ్ థాక్రేతో రెండు దశాబ్దాల తర్వాత చేతులు కలిపారు. మరాఠీ ‘ఇన్‌సైడర్–ఔట్‌సైడర్’ వాదనను మళ్లీ తెరపైకి తెచ్చారు.అయితే, రాజ్ థాక్రే ప్రదర్శన నిరాశపరిచింది. 52 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకుని, ఉద్ధవ్ ప్రయత్నాలకు ఊతం ఇవ్వలేకపోయారు. థాక్రేల మూడో మిత్రపక్షమైన ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఒక్క సీటుకే పరిమితమైంది.
మరోవైపు, బీజేపీ నేతృత్వంలోని కూటమి హిందుత్వం–అభివృద్ధి అనే ద్వంద్వ అజెండాను ప్రజల ముందుంచి విజయవంతమైంది. ఫలితాల అనంతరం బీజేపీ నేత నితేశ్ రాణే, “హిందుత్వం గురించి మాట్లాడేవారే మహారాష్ట్రను పాలిస్తారు” అంటూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, AIMIM పరిస్థితి
ఉద్ధవ్ శివసేన, ఎన్సీపీకి మిత్రపక్షమైన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. వంచిత్ బహుజన్ ఆఘాడితో చివరి నిమిషంలో కూటమి కుదిరినా పెద్దగా ప్రభావం చూపలేదు. కాంగ్రెస్ 26 సీట్లు, వంచిత్ 8 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి.
ఇక AIMIM మాత్రం తన బలం పెంచుకుంది. 2017లో రెండు సీట్లకే పరిమితమైన AIMIM ఈసారి 8 సీట్లు గెలుచుకుని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా, బీఎంసీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో శక్తిసమీకరణ పూర్తిగా బీజేపీ వైపు మళ్లిందని స్పష్టం చేశాయి. ముంబైలో అధికారం దక్కడం ద్వారా ఫడ్నవిస్ నాయకత్వానికి ప్రజలు స్పష్టమైన ముద్ర వేశారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.