తగ్గుముఖం పడుతుందనుకుంటున్న క్రమంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మరోసారి అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. ఎన్ని ఆంక్షలు విధించిన ప్రజల్లో మార్పు రావడం లేదు. మాస్కులు పెట్టుకోకుండానే రోడ్ల పైకి వస్తున్నారు. దీంతో మాస్క్ పెట్టుకోని వారి నుంచి ఫైన్స్ వసూలు చేయడం మొదలెట్టింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిన్న ఒక్క రోజులోనే ముంబైలో 14వేల 600 మందికి ఫైన్‌లు విధించి రూ.29 లక్షలు వసూలు చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మీద 22,976 మందికి ఫైన్ విధించగా.. రూ.45.95 లక్షల వసూలు అయినట్లు తెలిపింది. మాస్క్ రూల్ వచ్చినప్పటి నుంచి వసూల్ చేసిన మొత్తం రూ.30.5కోట్లు దాటినట్లు వెల్లడించింది.
ముంబైలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి బీఎంసీ కమిషనర్ ఐఎస్ చాహల్ కఠినమైన చర్యలు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ మొత్తం వసూలు చేయడం గమనార్హం. బీఎంసీ తాజా మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి రూ.200 జరిమానా విధిస్తున్నారు. ఫైన్ కట్టడానికి డబ్బులు లేవని చెప్పిన వారిని వీధులు శుభ్రం చేయడం లాంటి కమ్యూనిటీ సర్వీసులు చేయిస్తున్నారు. బీఎంసీ గణాంకాల ప్రకారం సంస్థ ప్రతి రోజు మాస్క్ ధరించని సుమారు 13,000 మంది నుంచి రోజుకు సగటున 25 లక్షల రూపాయలకు పైగా వసూలు చేస్తోంది.
గతవారం సీఎం ఉద్ధవ్ ఠాకరే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చాం. వీటిని పట్టించుకోకపోయినా.. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరిగినా.. మరోసారి లాక్ డౌన్ విధించాలా అనే విషయాన్ని తప్పక ఆలోచిస్తామన్నారు.