ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుడు..!
Blast near kempegowda airport in Bengaluru.బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీ ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుడు
By తోట వంశీ కుమార్ Published on 8 Jun 2021 9:33 AM ISTబెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు సమీపంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఎయిర్‌పోర్టులోని కార్గో కాంప్లెక్స్ ముందు భాగంలో రెండవ టెర్మినల్ కోసం రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కార్మికులు రోడ్డుకు ఇరువైపులా యంత్రం సహాయంతో తెల్లరంగు మార్కింగ్‌లు, జీబ్రా లైన్లు పూస్తున్నారు. తెల్లరంగు తయారీ కోసం సిలిండర్‌లో రసాయనాలు వేడి చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది.
సిలిండర్ పేలడంతో మంటలు ఎగిసి పడ్డాయి. పక్కనే నిల్వ ఉంచిన రంగు డబ్బాలకు సైతం మంటలు అంటుకున్నాయి. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో అక్కడే పని చేస్తున్న అవినాశ్, సిరాజ్, ప్రశాంత్, గౌతమ్, అజయ్‌కుమార్, నాగేశ్‌రావ్ అనే ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. క్షతగాత్రులను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ ఘటనపై విమానాశ్రయ వర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.