న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎంబసీ సంఘటనను ధృవీకరించింది. చాణక్యపురిలోని ఎంబసీ వద్ద 5.48 గంటలకు పేలుడు జరిగిందని ఎంబసీ ప్రతినిధి గై నిర్ తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ, ప్రాణ నష్టం కానీ సంభవించలేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి భారత్‌లోని తమ పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. ఎంబసీ వద్ద పేలుడును ఉగ్రవాద దాడిగా ఇజ్రాయెల్ అభివర్ణించింది.
ఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్‌లు, ప్రత్యేక పోలీసు బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సోదాలు నిర్వహించాయి. అయితే ఘటనా స్థలంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీలో ఇద్దరు నిందితులు కనిపించారని, వారి కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు సమీపంలోని కెమెరాల నుండి ఫుటేజీని కూడా విశ్లేషిస్తున్నారు. పేలుడు స్థలానికి సమీపంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ రాయబారిని ఉద్దేశించి టైప్ చేసిన లేఖ ఇజ్రాయెల్ జెండాతో చుట్టబడి ఉందని వర్గాలు తెలిపాయి. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను విమర్శిస్తూ ఆ లేఖ ఉంది. ఆంగ్లంలో రాసిన ఆ లేఖలో ఇది ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. కాగా 'సర్ అల్లా రెసిస్టెన్స్' అనే సమూహం ఈ పేలుడుకు తామే బాధ్యులమని ప్రకటించింది.