బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి
తమిళనాడులోని విరుదునగర్‌లోని శివకాశిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించారు.
By అంజి Published on 9 May 2024 6:00 PM ISTబాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి
తమిళనాడులోని విరుదునగర్‌లోని శివకాశిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. శివకాశిలోని సెంగమాలపట్టిలోని సుదర్శన్‌కు చెందిన బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించగా, ఫ్యాక్టరీలోని ఏడు గదులు ధ్వంసమయ్యాయి. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, దాదాపు కిలోమీటరు దూరం వరకు పెద్ద శబ్ధం వినిపించిందని స్థానికులు తెలిపారు. పేలుడు తర్వాత ఫ్యాక్టరీ నుంచి తెల్లటి పొగలు వెలువడ్డాయి. ఎఫ్‌ఐఆర్ , రెస్క్యూ సర్వీస్ సిబ్బంది ఘటనా స్థలంలో ఉన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ఇలా అన్నారు. '' శివకాశి సమీపంలోని గీజాతిరుతంగల్ గ్రామంలోని ఒక ప్రైవేట్ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 8 మంది కార్మికులు మరణించిన విషాద వార్త తెలిసి నేను చాలా బాధపడ్డాను, నేను వెంటనే విరుదునగర్ జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి ఆదేశాలు ఇచ్చాను. వీలైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించాను'' అని పేర్కొన్నారు.
మరణించిన కార్మికుల కుటుంబాలు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతిని,సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఎన్నికల కమిషన్ ఆమోదంతో బాధితులకు సహాయ సహకారాలు అందజేస్తానని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విరుదునగర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 10 మంది మరణించారు. అదేవిధంగా, 2023 అక్టోబర్‌లో విరుదునగర్‌లోని రంగపాళ్యం, కిచ్చనాయకన్‌పట్టి గ్రామంలోని బాణసంచా యూనిట్లలో రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలలో 11 మంది మరణించారు.