ఏమిటీ బ్లాక్ ఫంగస్.. కంటి చూపు పోవడమే కాకుండా.. ప్రాణాలు కూడా పోతాయా..?

Black Fungus Infection.భారతదేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు వస్తూ ఉండడం అధికారులను టెన్షన్ పెడుతూ ఉంది.

By Medi Samrat  Published on  13 May 2021 4:59 AM GMT
Black fungs infection

భారతదేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు వస్తూ ఉండడం అధికారులను టెన్షన్ పెడుతూ ఉంది. మహారాష్ట్ర, గుజరాత్​ వంటి రాష్ట్రాల్లో కోవిడ్–19 నుంచి కోలుకున్న వారిలో ముకోర్మైకోసస్ అని పిలిచే బ్లాక్​ ఫంగస్ ఇన్​ఫెక్షన్​ కేసులు పెరుగుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్​ దెబ్బకు కంటి చూపును సైతం కోల్పోతున్నారు.​ ఇది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, దీని మరణాల రేటు 50% కంటే ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. తడి ఉపరితలాల నుంచి ఎక్కువగా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఎవరిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి:

కరోనా నుంచి కోలుకున్న వారిలో రెండు మూడు రోజుల్లో ఈ బ్లాక్​ ఫంగస్​ లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదట సైనస్​లో చేరి తర్వాత కళ్ల పై ఇది దాడి చేస్తుంది. 24 గంటల్లో బ్రెయిన్​ వరకు వెళ్తుంది. ఆ తర్వాత బ్రెయిన్​ డెడ్​ అయి చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ముందే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్​మెంట్​ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చు. సమస్య తీవ్రంగా ఉన్న వారిలో యాఫోటెరిసన్​ 'బీ' వంటి యాంటీ ఫంగల్​ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని అంటున్నారు. ఒక రోగికి సాధారణంగా 21 రోజుల పాటు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్​ కోసం రోజు సుమారు రూ. 9,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. బ్లాక్​ ఫంగస్​ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని తెలిపారు.

మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో 50 శాతం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెబుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్ ఫంగస్ బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తుండటంతో, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను బ్లాక్ ఫంగస్ చికిత్స కేంద్రాలుగా మార్చారు. ఈ వ్యాధి చికిత్స కోసం ఆంఫోటెర్సిన్-బీ ఇంజెక్షన్లు అవసరమవుతాయని, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా లక్ష ఇంజెక్షన్ల కోసం టెండర్లను పిలిపించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ బ్లాక్ ఫంగస్ పై మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతూ ఉన్నాయి.


Next Story