ఓడిన బీజేపీ, కాంగ్రెస్ కీలక నేతలు..!
అమేథీ కాంగ్రెస్అభ్యర్థి కిషోరీ లాల్ శర్మ 1.5 లక్షల ఓట్ల తేడాతో స్మృతి ఇరానీని ఓడించి హాట్ టాపిక్‌గా మారారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jun 2024 10:30 AM IST
ఓడిన బీజేపీ, కాంగ్రెస్ కీలక నేతలు..!
కాంగ్రెస్ పార్టీ అమేథీ లోక్‌సభ అభ్యర్థి కిషోరీ లాల్ శర్మ 1.5 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడించి హాట్ టాపిక్‌గా మారారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ బీజేపీ అగ్ర నేతల్లో ఒకరుగా ఉన్నారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం శర్మకు 5,39,228 ఓట్లు రాగా, ఇరానీకి 3,72,032 ఓట్లు వచ్చాయి. ఈ ఓటమి బీజేపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ స్థానంలో తృణమోల్ కాంగ్రెస్‌కు చెందిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. కాంగ్రెస్ సీనియర్ లీడర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన అధిర్ రంజన్ చౌదరిపై విజయం సాధించాడు. ఈ స్థానం నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచిన అధీర్‌ను పఠాన్ 85,022 ఓట్ల తేడాతో ఓడించాడు.
ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర మంత్రి, ఖేరీ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన అజయ్ కుమార్ తేని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ఉత్కర్ష్ వర్మ మధుర్ చేతిలో 34,329 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
సుల్తాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీపై ఎస్పీ అభ్యర్థి రాంభూల్ నిషాద్ 43,174 ఓట్ల తేడాతో గెలవవడం రాష్ట్రంలో మరో సంచలనం.
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కుప్పుసామి కోయంబత్తూరులో తన సమీప ప్రత్యర్ధి, డీఎంకే నేత గణపతి రాజ్‌కుమార్‌పై 1,18,068 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 543 స్థానాలకు గానూ 240 స్థానాలు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే.. గతసారి సాధించిన 303 మార్కుకు ఈసారి ఫలితాలు చాలా దూరంలో ఉండటం మైనస్.