చండీగఢ్ మేయర్ పదవిని గెలుచుకున్న బీజేపీ
చండీగఢ్ మేయర్ పదవిని బీజేపీ గెలుచుకుంది. పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్
By Medi Samrat Published on 30 Jan 2024 2:08 PM ISTచండీగఢ్ మేయర్ పదవిని బీజేపీ గెలుచుకుంది. పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు మంగళవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు జరిగాయి. బీజేపీకి చెందిన మనోజ్‌కు 16 ఓట్లు రాగా, ఆప్ అభ్యర్థి కుల్‌దీప్‌కు 12 ఓట్లు వచ్చాయి. మిగిలిన 8 ఓట్లను రద్దు చేశారు. ఆప్ నేత రాఘవ్ చద్దా, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా, కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ గత కొన్ని రోజులుగా తమ తమ పార్టీల కౌన్సిలర్లను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికలపై జాతీయ స్థాయి నేతలు ప్రత్యేక దృష్టి సారించారు.
కాంగ్రెస్, ఆప్ కౌన్సిలర్లు ఎన్నికల సమయంలో పంజాబ్‌లోనే మకాం వేశారు. ముందుగా ఈ ఎన్నికలను జనవరి 18న నిర్వహించాల్సి ఉండగా, చివరి క్షణంలో ప్రిసైడింగ్ అధికారి అస్వస్థతకు గురికావడంతో నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికలు నిర్వహించలేక పోవడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఆదేశాలతో మంగళవారం ఎన్నికల తేదీని ఖరారు చేశారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. ఈ కూటమి బీజేపీకి ప్రత్యక్ష పోటీనిచ్చింది. కాంగ్రెస్-ఆప్ కూటమికి 20 ఓట్లు రాగా, బీజేపీకి 15 ఓట్లు వచ్చాయి.
మధ్యాహ్నం 1 గంటకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 35 మంది కౌన్సిలర్లు, ఎంపీ కిరణ్ ఖేర్‌ను కలుపుకుంటే 36 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ జరిగిన వెంటనే ఫలితాలు వెలువడ్డాయి. అయితే, ఓటింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్, ఆప్ మధ్య తీవ్ర రచ్చ జరిగింది. 35 మంది సభ్యులు కలిగిన చండీఘఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ 16 స్ధానాలను గెలుపొందడం విశేషం.