భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మరియు రాజస్థాన్‌లలో తన శాసనసభా పక్షాల నాయకులను ఎన్నుకోవడానికి కేంద్ర పరిశీలకులను శుక్రవారం నియమించింది. వారాంతంలో కొత్త ముఖ్యమంత్రుల పేర్లు వెలువడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు పరిశీలకులుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తవాడే, సరోజ్ పాండే, మధ్యప్రదేశ్‌కు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కె లక్ష్మణ్, ఆశా లక్రాలను నియమించారు. ఛత్తీస్‌గఢ్‌కు కేంద్రమంత్రులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ గౌతమ్ లను నియమించారు.
గురువారం పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ.. పరిశీలకులు వారి వారి రాష్ట్రాలకు వెళ్లి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశాలను పర్యవేక్షించి, అక్కడ కాబోయే ముఖ్యమంత్రులు ఎంపిక చేస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి ఎంపికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ముగ్గురు ముఖ్యమంత్రులను ఎన్నుకోవడంలో పార్టీ సామాజిక, ప్రాంతీయ, పాలన, సంస్థాగత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటుందని కూడా ఆయన చెప్పారు. మూడు రాష్ట్రాలకు చెందిన నాయకులు హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా పార్టీ ఉన్నతాధికారులను కలుస్తున్నారు, అయితే ఇటువంటి సమావేశాలు సాధారణమైనవని వర్గాలు చెబుతున్నాయి.