పశ్చిమ బెంగాల్‌లోని నాగరకత ప్రాంతంలో సోమవారం నాడు బీజేపీ ఎంపీ ఖాగెన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుండగా స్థానికులు వారిపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు నాయకులకు గాయాలు కాగా, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
సంఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనకు సంబంధించిన వీడియోలలో బీజేపీ నాయకుల కారు అద్దాలు పగిలిపోయాయి. ఎంపీ ఖాగెన్ ముర్ము ముక్కు నుండి రక్తం కారుతూ ఉండడం విజువల్స్ లో చూడొచ్చు. ఎమ్మెల్యే శంకర్ ఘోష్ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన దుస్తులు చిరిగిపోయాయి. ఈ దాడి రాజకీయంగా కలకలం రేపింది. సహాయక చర్యలను అడ్డుకోవడానికి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు.