కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా.? ఏం జ‌రుగుతుంది.?

ఎక్సైజ్ పాలసీలో జరిగిన కుంభకోణంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండడంతో రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదం ఉంది

By Medi Samrat  Published on  10 Sept 2024 3:05 PM IST
కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా.? ఏం జ‌రుగుతుంది.?

ఎక్సైజ్ పాలసీలో జరిగిన కుంభకోణంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండడంతో రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదం ఉంది. అయితే ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే నడిపిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ పదేపదే పునరుద్ఘాటించింది.

అయితే.. రాష్ట్రపతి భ‌వ‌న్‌ హోం మంత్రిత్వ శాఖకు లేఖ పంపింది. అంత‌కుముందు ఢిల్లీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ లేఖ‌పై స్పందించిన రాష్ట్రపతి భ‌వ‌న్‌ హోం మంత్రిత్వ శాఖకు లేఖ పంపింది.

రాష్ట్రపతి భ‌వ‌న్ బీజేపీ ఎమ్మెల్యేల లేఖ‌పై స్పందించింది. రాష్ట్రపతి సెక్రటేరియట్ డైరెక్టర్ శివేంద్ర చతుర్వేది ప్రతిపక్ష నేత విజేంద్ర గుప్తాకు లేఖ పంపారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆగస్టు 30న రాష్ట్రపతిని కలిసి ఇచ్చిన మెమోరాండంను పరిగణలోకి తీసుకుని తగిన చర్య కోసం హోం మంత్రిత్వ శాఖకు పంపిన‌ట్లు పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రతిపక్ష నేత విజేంద్ర గుప్తా నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై మెమోరాండం సమర్పించారు. ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని ఆరోపిస్తూ.. ఢిల్లీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో పరిపాలనా వ్యవస్థ స్తంభించిపోయింది. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో నాలుగు నెలలకు పైగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. జైలులో ఉన్నప్పటికీ.. కేజ్రీవాల్ రాజీనామా చేయడానికి నిరాకరించారు.. దీని కారణంగా సంక్షోభం ఏర్పడింది అని ఆయన అన్నారు. ఢిల్లీలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది, దీని కారణంగా ముఖ్యమైన పరిపాలనా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్నారు. రాజ్యాంగ నిబంధనలను, సంప్రదాయాలను ఆప్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. ఆరవ ఢిల్లీ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు ఏప్రిల్ 2021 నుండి పెండింగ్‌లో ఉంది. దీని కారణంగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు అవసరమైన మేరకు నిధులు రావడం లేదన్నారు. కాగ్ 11 నివేదికలను ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించడం లేదని విజేంద్ర గుప్తా అన్నారు. ఎక్సైజ్ కుంభకోణం, ఢిల్లీ జల్ బోర్డులో అవినీతి సహా ఇతర అవినీతి ఆరోపణలను కూడా ఎమ్మెల్యేలు మెమోరాండంలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల అమలును ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నదని ఆరోపించారు. 'రాజధానిలో పాలన దిగజారుతున్నందున, ఢిల్లీ పౌరులకు అందించే సౌకర్యాలకు అంతరాయం కలుగుతోంది' అని బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు.

మరోవైపు రానున్న ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిని బీజేపీ ఇప్పటికే అంగీకరించిందని ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి అన్నారు. బ్యాక్ డోర్ ద్వారా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడమే బీజేపీ పని. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బీజేపీ భయపడుతోంది. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు సేవ చేశారు. ఇది బీజేపీ కొత్త కుట్ర. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి సున్నా సీట్లు వస్తాయన్నారు ఆమె.

Next Story