భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ లు..!

BJP MLA Soumen Roy joins TMC ahead of Bengal bypolls. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ లోకి పెద్ద ఎత్తున

By Medi Samrat  Published on  4 Sep 2021 12:31 PM GMT
భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ లు..!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ లోకి పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చేరిన సంగతి తెలిసిందే..! ఈసారి దీదీకి తప్పకుండా చెక్ పెడతామని బీజేపీ నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. దీదీకి ఎంతో నమ్మకంగా ఉన్నవాళ్లు కూడా పార్టీని విడిచిపెట్టి బీజేపీ చెంతన చేరడం మొదలుపెట్టారు. అయితే ఎన్నికల ఫలితాల్లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయాన్ని దక్కించుకుంది. అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ ను వీడిన వాళ్లంతా తిరిగి సొంత గూటికి చేరుకుంటూ ఉన్నారు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో భారతీయ జ‌న‌తాపార్టీకి వరుస షాక్ లు తగులుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు బీజేపీని వదిలిపెడుతూ ఉన్నారు. ఇప్ప‌టికే ఎమ్మెల్యేలు ముకుల్ రాయ్‌, త‌న్మ‌య్ ఘోష్‌, విశ్వ‌జిత్ దాస్‌లు బీజేపీని వీడి తృణ‌మూల్ కాంగ్రెస్ గూటికి చేరారు.

తాజాగా క‌లియ‌గంజ్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే సౌమెన్ రాయ్ కూడా బీజేపీని వీడి అధికార‌ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పార్థ చ‌ట‌ర్జీ స‌మ‌క్షంలో సౌమెన్ రాయ్ టీఎంసీ కండువా క‌ప్పుకున్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసినప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు బీజేపీకి హ్యాండిచ్చి టీఎంసీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య‌ సౌమెన్ రాయ్‌తో క‌లిపి నాలుగుకు పెరిగింది. ఈ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన వారే..! ఎమ్మెల్యే సౌమెన్ రాయ్‌ మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ధితోపాటు, ఉత్త‌ర‌బెంగాల్ అభివృద్ధి కోస‌మే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు. ఇంకా పలువురు నాయకులు భారతీయ జనతా పార్టీని వీడబోతున్నారని తృణమూల్ నేతలు చెప్పుకొచ్చారు.


Next Story
Share it