భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేకు పాకిస్థాన్ నుండి బెదిరింపులు వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు నిన్ను కూడా చంపేస్తామని తనకు బెదిరింపులు వచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే సరితా భదౌరియా పోలీసులను ఆశ్రయించారు. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, భద్రత కల్పించాలని ఆ మహిళా ఎమ్మెల్యే పోలీసులకు కోరారు. పాక్ గూఢచార సంస్థ ఎస్‌ఐఎస్ లోగోతో వాట్సాప్‌లో సందేశాలు వచ్చాయని.. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తొలి సందేశం రాగా ఆ తర్వాత వరుస పెట్టి సందేశాలు వచ్చాయని అన్నారు. సరితా భదౌరియా 1999లో భర్త అభయ్ వీర్ సింగ్ భదౌరియా హత్యానంతరం రాజకీయాల్లోకి వచ్చారు.
సరితా భదౌరియా ఎటావా సదర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గా ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధి జాయింట్ కమిటీ ఎటావా చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. నరేంద్ర మోదీ, సీనియర్ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను చంపేస్తామని తనకు వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు వచ్చాయని సరితా భదౌరియా తెలిపారు.
ఆదివారం ఉదయం వరకు ఎమ్మెల్యేతో పాటు ప్రధాని, బీజేపీ సీనియర్, ఆర్‌ఎస్‌ఎస్ నేతలను చంపేస్తామంటూ 8 సందేశాలు వచ్చాయని పోలీసులకు ఆమె తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన +92 సిరీస్‌తో ప్రారంభమైన మొబైల్ నంబర్ నుంచి సందేశాలు వచ్చాయని, వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.