మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ పొత్తు కుదిరిందనే వార్తలు దేశం మొత్తాన్ని షాక్ కు గురిచేశాయి. అయితే కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ బుధవారం నాడు ఈ ఆరోపణలు తోసిపుచ్చారు. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనను పక్కనపెట్టి, అధికారం దక్కించుకోవడానికి ఊహించని రాజకీయ పునర్వ్యవస్థీకరణ జరిగిందనే ప్రచారం తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. ఇది కేవలం బీజేపీ-కాంగ్రెస్ మధ్య పొత్తు కాదని, శివసేన "అవినీతి"కి వ్యతిరేకంగా పోరాడటానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలిసి నడుస్తున్నారని సావంత్ స్పష్టం చేశారు.
"అంబర్‌నాథ్‌లో, పార్టీ అనుబంధాలు, చిహ్నాలను పక్కనపెట్టి, స్థానిక షిండే సేన చేసిన అవినీతికి వ్యతిరేకంగా వివిధ పార్టీ కార్యకర్తలు అంబర్‌నాథ్ డెవలప్‌మెంట్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో స్వతంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి, కాంగ్రెస్, బీజేపీ కలిసి వచ్చాయనే వార్తల నివేదికలు తప్పు. దయచేసి గమనించండి" అని ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు.
అయితే, బీజేపీ కాంగ్రెస్ తో దోస్తానా వార్తలను తోసిపుచ్చింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు గులాబ్‌రావ్ కరంజులే పాటిల్ స్పందించారు. షిండే నేతృత్వంలోని పార్టీ గత 25 సంవత్సరాలుగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.