ముంచుకొస్తోన్న బిపోర్‌జాయ్ తుపాను.. 8 రాష్ట్రాలపై ప్రభావం
బిపోర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాను గుజరాత్‌లోని జఖౌ పోర్టు
By Srikanth Gundamalla Published on 14 Jun 2023 12:30 PM ISTముంచుకొస్తోన్న బిపోర్‌జాయ్ తుపాను.. 8 రాష్ట్రాలపై ప్రభావం
బిపోర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాను గుజరాత్‌లోని జఖౌ పోర్టు దగ్గర తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. తీరం దాటే సమయంలో తుపాను ప్రభుత్వం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తుపాను ప్రభావం గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాలపైనా ప్రభావం చూపే చాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. వాతావరణశాఖ హెచ్చరికలతో తీర ప్రాంతాలున్న రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బిపోర్‌జాయ్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనున్న గుజరాత్‌లోని కచ్, ద్వారక, సౌరాష్ట్ర ప్రాంతాలకు ఐఎండీ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను ఇంకా తీరం దాటకముందే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
గుజరాత్‌లోని కచ్, ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, మోర్బీ, జనాగఢ్, రాజ్‌కోట్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ రెండ్రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐంఎడీ తెలిపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అయితే 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది ఐఎండీ.దీంతో ఆయా రాష్ట్రాల అధికారులు అలెర్ట్ అయ్యారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాదు.. పలుచోట్ల వరద ముప్పు కూడా ఉందని భారతవాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో.. కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు ముందుస్తుగా రంగంలోకి దిగాయి. ఇప్పటికే దాదాపు 38వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. బిపోర్‌జాయ్ తుపాను ప్రభావంతో గుజరాత్‌లో పలుచోట్ల భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైమైనా తుపాను వల్ల ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడేందుకు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంసిద్ధంగా ఉన్నాయి.
బిపోర్‌జాయ్ తుపాను ఏఏ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే దానిపై ఐఎండీ అంచనా వేసింది. గుజరాత్‌తో పాటు మరో 8 రాష్ట్రాల్లో తుపాను ప్రభావం ఉంటుందని తెలిపింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవాపైనా తుపాను విరుచుకుపడే చాన్స్ ఉన్నట్లు తెలిపింది. దీంతో.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి.