బయోలాజికల్-ఈ నుండి వ్యాక్సిన్ వచ్చేస్తోంది
Biological E set for Covid vaccine rollout by August. బయోలాజికల్-ఈ కు చెందిన వ్యాక్సిన్ ఆగష్టులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 7 May 2021 11:55 AM GMTభారతదేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయాల్లో చాలా కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు భారత్ లో ట్రయల్స్ స్థాయిలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ కూడా కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉంది. బయోలాజికల్-ఈ కు చెందిన వ్యాక్సిన్ ఆగష్టులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రతి నెలా 75 నుండి 80 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేయాలనే టార్గెట్ గా కూడా పెట్టుకుంది. బయోలాజికల్ ఈ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉంది. ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) సబ్జెక్ట్ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) నుంచి ఆమోదం లభించింది. నవంబర్ 2020లోనే బయోలాజికల్ ఈ తన కరోనా వ్యాక్సిన్ తొలి, రెండో దశ క్లినియకల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ రెండు దశల్లోనూ ఆశించిన ఫలితాలను రాబట్టింది. ఇక మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 15 ప్రాంతాల్లో చేపట్టనుంది.
బయోలాజికల్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల మాట్లాడుతూ తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఆశించిన ఫలితాలను ఇస్తోందని అన్నారు. ఇక వ్యాక్సిన్ ధర కూడా అతి తక్కువ ధరలో.. అందుబాటు ధరకే దొరికే అవకాశం లేకపోలేదని మహిమ దాట్ల చెప్పుకొచ్చారు. తాము వ్యాక్సిన్ కోసమే ఈ మార్కెట్ లోకి రాలేదని.. మూడు తరాలుగా తాము ఈ ఫీల్డ్ లో ఉన్నామని తెలిపారు. ప్రజలకు తాము మంచి చేయాలనే సంకల్పంతో ఉన్నామని.. దేశానికి కూడా ఉపయోగపడతామని అన్నారు. వ్యాక్సిన్ తయారీ విషయంలో కూడా తాము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామని.. అంతేకాకుండా పెద్ద ఎత్తున తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు.
బయోలాజికల్ ఈ తయారు చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఆగష్టు దాకా ఎదురుచూడాల్సిందే..! బయోలాజికల్-ఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే భారత్ లో వ్యాక్సిన్ల కొరత తీరే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా వ్యాక్సినేషన్ కూడా భారత్ లో వేగంగా జరిగే అవకాశం ఉంది.