కొత్త బిల్లు తీసుకొచ్చిన కేంద్రం.. ఇక ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు చెక్!
ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో దుర్వినియోగం, అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్ర కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి
కొత్త బిల్లు తీసుకొచ్చిన కేంద్రం.. ఇక ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు చెక్!
ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో దుర్వినియోగం, అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్ర కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది చట్టం రూపం దాలచితే మనీ బేస్‌డ్ గేమింగ్ ట్రాన్సాక్షన్సన్నీ బ్యాన్ అవుతాయి. ఈ బిల్లులో పెద్ద మొత్తంలో జరిమానాలు, శిక్షలు, అవసరమైతే గేమింగ్ యాప్‌లపై నిషేధం వంటి కఠిన నిబంధనలు ఉన్నాయి.
బెట్టింగ్ లేదా జూదం కలిగిన గేమ్‌లను ప్రసిద్ధులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేయడం నిషేధం. ఉల్లంఘన చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. వినోదం కోసం రూపొందిన సాధారణ గేమ్‌లపై ఎలాంటి పరిమితులు ఉండవు. భవిష్యత్తులో ఇలాంటి గేమ్‌లను అంతర్జాతీయ ఒలింపియాడ్లలో కూడా పరిగణించే అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
పన్నుల పరంగా, బెట్టింగ్ గేమింగ్ యాప్‌లను “సిన్ గూడ్స్” కేటగిరీ కిందకి తీసుకురావాలని కేంద్రం పరిశీలిస్తోంది. ఇది అమలైతే 40% వరకు జీఎస్టీ పన్ను విధించబడే అవకాశం ఉంది.
2023 అక్టోబర్ నుండి ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% జీఎస్టీ అమల్లో ఉంది. ఆటగాళ్ల గెలుపు మొత్తాలపై 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి 30% ఆదాయపు పన్ను విధిస్తున్నారు. విదేశీ ప్లాట్‌ఫారమ్‌లపైనా పన్ను నిబంధనలు విస్తరించబడి, రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తే బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.
ఇకపోతే, 2029 నాటికి భారత ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ $9.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం (2024లో) ఈ మార్కెట్ విలువ $3.7 బిలియన్‌గా ఉంది. ఇందులో 86% ఆదాయం రియల్ మనీ గేమ్స్‌దే అని WinZO గేమ్స్, IEIC తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి.