ట్రైన్‌లో బాలికపై వేధింపులు, ప్రయాణికుల దాడిలో నిందితుడు మృతి
రోజురోజుకు అమ్మాయిలపై లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 13 Sep 2024 12:12 PM GMTరోజురోజుకు అమ్మాయిలపై లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. చిన్నారులపైనా కొందరు కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా బీహార్‌లో మరో సంఘటన చోటుచేసుకుంది. అయితే.. రైలులో వెళ్తున్న సమయంలో 11 ఏళ్ల బాలికపై రైల్వే ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అది గమనించిన ప్రయాణికులు అతనిపై దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. నిందితుడిని అదే రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కుమార్‌గా పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన ఓ కుటుంబం ఢిల్లీ వెళ్లేందుకు హమ్‌సఫర్ రైలు ఎక్కింది. జనరల్ టికెట్లు తీసుకున్న వారు, టీటీఈ వద్ద పర్మిషన్ తీసుకుని ఏసీ కోచ్-డీలో కూర్చున్నారు. మార్గ మధ్యలో ఆ కుటుంబం వద్దకు రైల్వే ఉద్యోగి, ఆ కోచ్ అటెండెంట్ ప్రశాంత్ కుమార్ రాత్రి వచ్చారు. ఆ సమయంలో బాధితురాలి తల్లి వాష్ రూమ్‌కి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ప్రశాంత్ కుమార్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. తల్లి కాసేపటికే రావడంతో ఏడుస్తూ బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. భర్తకు తెలిపడంతో.. తోటి ప్రయాణికులు కూడా ఇది విన్నారు. దాంతో.. ఆగ్రహించిన భర్త, తోటి ప్రయాణికులు ప్రశాంత్ కుమార్‌పై దాడి చేశారు. తీవ్రంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత కాన్పూర్ స్టేషన్‌కు వచ్చిన తర్వాత రైల్వే ప్రొటెక్షన్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇక బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో, వేధింపుల కేసు నమోదు చేశారు.