శరీర ఉష్ణోగ్రత 108 ° F చేరడంతో వ్యక్తి మృతి
శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పెరిగిన తర్వాత బహుళ అవయవ వైఫల్యం కారణంగా 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
By అంజి Published on 31 May 2024 8:48 AM ISTశరీర ఉష్ణోగ్రత 108 ° F చేరడంతో వ్యక్తి మృతి
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. తీవ్ర ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి హీట్ స్ట్రోక్ (వడదెబ్బ)తో 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని దర్భంగాకు చెందిన బాధితురాడు సోమవారం అర్థరాత్రి ప్రభుత్వ ఆధ్వర్యంలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరాడు. అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే దాదాపు 10 డిగ్రీలు ఎక్కువగా పెరిగింది. శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పెరిగిన తర్వాత బహుళ అవయవ వైఫల్యం కారణంగా అతను మరణించాడు.
"అధిక శరీర ఉష్ణోగ్రత కారణంగా రోగి యొక్క మూత్రపిండాలు, కాలేయం విఫలమయ్యాయని, ఆ తరువాత అతను చికిత్స పొందుతూ మరణించాడు" అని ఆర్‌ఎమ్‌ఎల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ రాజేష్ శుక్లా చెప్పారు. "ఆసుపత్రి సరైన చికిత్స అందించడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, వేడి కారణంగా మరణం సంభవించింది" డాక్టర్ శుక్లా చెప్పారు. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో పరిస్థితులు అతలాకుతలమవుతున్నాయి. నగరంలో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఢిల్లీలోని ప్రాథమిక వాతావరణ కేంద్రం, సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో బుధవారం గరిష్టంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 79 సంవత్సరాలలో ఇదే అత్యధికం. భారత వాతావరణ శాఖ (IMD) డేటా ప్రకారం.. జూన్ 17, 1945న 46.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నగరంలోని ఇతర ప్రాంతాలు కూడా నజాఫ్‌గఢ్‌లో 49.1 డిగ్రీల సెల్సియస్, పూసాలో 49 డిగ్రీల సెల్సియస్, నరేలాలో 48.4 డిగ్రీల సెల్సియస్ వద్ద గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్ నుండి నగరంలోకి వేడి గాలులు వీచడంతో దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరిగాయని ఐఎండీ అధికారులు తెలిపారు.