వృద్ధుడి బ్యాంకు ఖాతాలో రూ. 52 కోట్లు..!
Bihar Farmer Receives 52 Crore in his Account.ఇటీవల బీహార్ రాష్ట్రంలో సామాన్యుల ఖాతాల్లో కోట్ల రూపాయలు
By తోట వంశీ కుమార్ Published on 18 Sept 2021 8:25 AM ISTఇటీవల బీహార్ రాష్ట్రంలో సామాన్యుల ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అవుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు కానీ.. అకస్మాత్తుగా అంతంత నగదు వచ్చి పడుతుండడంతో ఖాతాదారులు ఆశ్చర్యపోతున్నారు. గురువారం ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ.960 కోట్లు జమ అయిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ కొనసాగుతుండగానే.. ఆ రాష్ట్రంలో ఇలాంటి ఘటననే మరొకటి వెలుగుచూసింది. శుక్రవారం వృద్దుడి ఫించన్ ఖాతాలో రూ.52కోట్లు జమ అయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. ముజఫరాపూర్ జిల్లా కతిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్ బహుదూర్ షా అనే ఓ రైతు నివసిస్తున్నాడు. బ్యాంకులో పింఛన్ ఖాతా బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం దగ్గరలోని కస్టమర్ సర్వీస్ పాయింట్(సీఎస్‌పీ)కి వెళ్లాడు. ఆధార్‌కార్డు సమర్పించిన అతడు, వేలిముద్ర వెరిఫికేషన్ చేశాడు. ఈ క్రమంలో రైతు.. తన ఖాతాలో ఎంత నగదు ఉందో చెప్పాలని అక్కడి అధికారిని కోరగా.. ఖాతా చెక్ చేసిన అధికారి షాక్‌కు గురైయ్యాడు. రామ్ బహుదూర్ షా ఖాతాలో రూ.52కోట్లు ఉన్నట్లు చెప్పాడు. కాగా.. అంత మొత్తంలో నగదు తన ఖాతాలో ఎలా వచ్చిందో తెలియదని రామ్ బహుదూర్ షా తెలిపాడు. తాను వ్యవసాయంపై ఆధారపడి జీవితం కొనసాగిస్తున్నానని.. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఆ ఖాతాలో కొంత నగదును ఇప్పిస్తే.. తన జీవితం సాఫీగా సాగిపోతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
క్షణాల్లో ఈ వార్త ఆ చుట్టుప్రక్కల వ్యాపించింది. మీడియా ద్వారా సమాచారం అందిందన్న కతిహర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ మనోజ్ పాండే.. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. కాగా.. ఇలా పెద్ద మొత్తంలో నగదు ఖాతాల్లో జమ అయిన సందర్భాల్లో ఆయా ఖాతాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. నగదు ఉపసంహరించుకోకుండా చూస్తున్నారు.