కారు లైట్ల వెలుగులో 12వ తరగతి విద్యార్థులు పరీక్ష రాశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 400 మంది విద్యార్థులు ఇలాగే పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కారు లైట్ల వెలుగులో విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం అయ్యాయి. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (బీఎస్‌ఈబీ) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. తూర్పు చంపారన్ జిల్లాలో మహారాజా హరేంద్ర కిషోర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 400 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే.. మధ్యాహ్నాం 1.45 గంటల ప్రారంభం కావాల్సి పరీక్ష కొన్నికారణాల వల్ల ఆలస్యంగా.. అంటే సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైంది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే చీకటి పడింది. అయితే.. అక్కడ కరెంట్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు కారు లైట్ల వెలుగులో పరీక్ష రాశారు.
ఈ ఘటనపై గురువారం బీహార్ విద్యాశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి స్పందించారు. పరీక్షా సమయంలో ఆ కేంద్రంలోని ప్రత్యేక పరిస్థితి నెలకొన్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచనలు జారీ చేసినట్లు మీడియాతో మంత్రి చెప్పారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చంపారన్ జిల్లా విద్యాశాఖ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు.