'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'కి డిప్యూటీ సీఎం సాయం
Bihar Deputy CM Tejashwi Yadav help graduate Chai Wali. 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ' పేరుతో టీస్టాల్ నడుపుతూ పేరు తెచ్చుకున్న ప్రియాంక గుప్తాకు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి
By అంజి Published on 19 Aug 2022 10:51 AM GMT'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ' పేరుతో టీస్టాల్ నడుపుతూ పేరు తెచ్చుకున్న ప్రియాంక గుప్తాకు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని పూర్నియా జిల్లాకు చెందిన ప్రియాంకా.. తాను జీవనోపాధి కోసం టీ స్టాల్ నడుపుతోంది. ఈ క్రమంలోనే టీ స్టాల్‌ను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో ప్రియాంకా గుప్తా కన్నీటి పర్యంతం అయ్యారు. టీ స్టాల్ పోయిందంటూ.. ఆమె వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రోడ్డు ఆక్రమణల తొలగింపులో భాగంగా పాట్నా మున్సిపల్ అధికారులు ప్రియాంకాకు మొదట నోటీసులు ఇచ్చారు. అయితే స్టాల్‌ను తొలగించొద్దని ఆమె.. అధికారులను వేడుకుంది. రూల్స్ ప్రకారం.. మున్సిపాలిటీ వద్ద డబ్బును డిపాజిట్ చేసి, తన దుకాణాన్ని తిరిగి తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని అధికారులను ఆమె కోరింది. అయినప్పటికీ వినకుండా.. ఆమె స్టాల్‌ను అధికారులు తొలగించారు. ఈ క్రమంలోనే తనకు సాయం చేయాలంటూ.. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లను ప్రియాంకా కలిసింది.
డిప్యూటీ సీఎం సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ప్రియాంకా గుప్తా టీ స్టాల్ ను మున్సిపల్ అధికారులు పునరుద్ధరించారు. ఈ పరిణామంపై గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ సంతోషం వ్యక్తం చేసింది. టీ స్టాల్ తో తాను నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నానని ప్రజలు అంటున్నారని, అయితే దాని నిర్వహణకు అంతే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయని ప్రియాంక చెప్పింది. ప్రియాంక కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. అయితే నెలల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె టీ షాప్ పెట్టాలని నిర్ణయించుకుంది. 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ' పేరుతో పాట్నా బోరింగ్ రోడ్‌లో టీ స్టాల్ ఏర్పాటు చేసింది. కొన్ని రోజులకే స్థానికంగా ఈ టీ స్టాల్ చాలా ఫేమస్ అయ్యింది.