హోదా ఇవ్వాలి.. లేదా ఉద్యమం చేస్తామని కేంద్రానికి సీఎం అల్టిమేటం

తాజాగా బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్ మరో సంచలన ప్రతిపాదనకు తెరతీశారు.

By Srikanth Gundamalla  Published on  17 Nov 2023 6:04 AM GMT
bihar, cm nitish, ultimatum,  central govt,

హోదా ఇవ్వాలి.. లేదా ఉద్యమం చేస్తామని కేంద్రానికి సీఎం అల్టిమేటం

కేంద్ర ప్రభుత్వం వద్దన్నా వినకుండా ఇటీవల కులగణన నిర్వహించింది బీహార్ ప్రభుత్వం. ఆ తర్వాత నివేదికను విడుదల చేసి.. ఆ మేరకు రిజర్వేషన్లను పెంచుతూ బీహార్‌లో ఉన్న నితీశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్ మరో సంచలన ప్రతిపాదనకు తెరతీశారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా.. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు.

ఈ సందర్బంగా మాట్లాడిన బీహార్‌ సీఎం నితీశ్‌ కమార్‌.. ఎన్నో ఏళ్లుగా బీహార్‌కు ప్రత్యేక హోదా కోసం జేడీయూ పార్టీ పోరాడుతోందని చెప్పారు. బీహార్‌లో అభివృద్ధి వేగంగా జరగాలంటే ప్రత్యేక హోదా అవసరమని నితీశ్‌ కుమార్ తేల్చి చెప్పారు. అయితే.. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించడానికి అడ్డుకునేవారు.. మద్దతు ఇవ్వని వారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటామని చెప్పినట్లే అని అన్నారు. గతంలో ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉండి జేడీయూ బయటకు వచ్చింది. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు నితీశ్ సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది. తొందరలోనే బీహార్‌కు ప్రత్యేక హోదా విషయం తేల్చాలని.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని సీఎం నితీశ్ పేర్కొన్నారు.

బీహార్‌కు ప్రత్యేక హోదా ఎంత అసరమో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియాలన్నారు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా ప్రతి గ్రామానికీ ఈ డిమాండ్ తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పలు సంక్షేమ పథకాలు అందించాలని నిర్ణయించామని.. అందుకోసం బిహార్‌లాంటి పేద రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయాల బడ్జెట్ అవసరం అవుతుందని నితీశ్ కుమార్ పేర్కొన్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదాను ఇస్తే ఐదేళ్లలో చేయాల్సిన అభివృద్ధి రెండున్నరేళ్లలోనే అందించగలుగుతామని తెలిపారు. రాష్ట్రంలో చాలా మంది పేద ప్రజలు ఉన్నారని.. వారి అభివృద్ధి కోసం కేంద్రం ముందుకు రావాలన్నారు. కేంద్రం తమ ప్రతిపాదనను ఒప్పుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వానికి బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story