బీహార్‌ సీఎం నితీష్‌ రాజీనామా.. రసవత్తరంగా రాజకీయాలు

బీహార్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ తన సీఎం పదవికి రాజీనామా చేశారు.

By Srikanth Gundamalla  Published on  28 Jan 2024 7:11 AM GMT
bihar,  nitish kumar, resign, bjp, jdu,

బీహార్‌ సీఎం నితీష్‌ రాజీనామా.. రసవత్తరంగా రాజకీయాలు

బీహార్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివరాం రోజున రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలో విపక్షాల కూటమికి ఆయన గుడ్‌బై చెప్పినట్లు అయ్యింది. అయితే.. జేడీయూ.. బీహార్‌లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించింది.

ఆదివారం ఉదయం పాట్నాలోని అధికారిక నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేలతో అధినేత నితీష్‌ కుమార్ సమావేశం అయ్యారు. వారితో చర్చించిన తర్వాతే రాజీనామా చేయాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశం తర్వాత నితీష్‌ కుమార్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వివరించి.. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఆ తర్వాత నితీష్ కుమార్‌ తిరిగి తన నివాసానికి చేరుకున్నారు. కాగా.. నితీష్‌ కుమార్ రాజీనామాతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి కూలిపోయింది.

కాగా.. రాజీనామా తర్వాత నితీష్‌ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నరగా మహా కూటమి ప్రభుత్వం సరిగ్గా ముందుకు వెళ్లలేకపోయిందని నితీష్ కుమార్ అన్నారు. గతంలో ఉన్న ఎన్డీయే కూటమితో వెళ్లాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే రాజీనమా నిర్ణయం తీసుకున్నామని నితీష్ కుమార్ వెల్లడించారు.

ఇక ఆదివారం సాయంత్రం 4 గంటలకే నితీష్‌ కుమార్ మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీతో చేతులు కలిపి.. నితీష్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే బీజేపీ, జేడీయూలు తమ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభా పక్ష నేతగా నితీష్‌ను ఎన్నుకుంటారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశాన్ని కోరతారు. కాగా.. జేడీయూ అధినేత నితీష్‌ సీఎంగా బాధ్యతలు మరోసారి తీసుకుంటే.. బీజేపీ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటారని సమాచారం అందుతోంది.

కాగా.. బీహార్‌ అసెంబ్లీలో మొత్తం సీట్లు 243 కాగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్లు 122. అయితే.. బీహార్‌లో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 78 కాగా.. జేడీయూ ఎమ్మెల్యేలు 45 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మెమ్మెల్యే సంఖ్య మేజిక్‌ ఫిగర్ కన్నా ఒక సీటు ఎక్కువే ఉంది. దీనికి తోడు హిందుస్తానీ ఆవాం మోర్చా కూడా తమకు మద్దతుగా ఉందని బీజేపీ చెబుతోంది. ఆ పార్టీకి ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను కలుపుకొంటే కూటమి బలం 127కి చేరుకుంటుంది. దాంతో.. మరోసారి నితీష్‌ కుమార్‌ జేడీయూ, ఎన్డీయే కూటమి నేతృత్వంలోని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోనున్నారు.

Next Story