ఇంటి డాబాపై చదువుతున్న పదో తరగతి బాలికను కోతులు భయపెట్టి కిందకు తోసేసిన ఘటన బిహార్‌లోని సివాన్‌లో జరిగింది. విద్యార్థిని ప్రియ డాబాపై చదువుకుంటుండగా కోతుల గుంపు దాడి చేసింది. కోతులు తన పైకప్పుపైకి రావడంతో బాధితురాలు భయాందోళనకు గురైంది. ఆమె పరిగెత్తలేకపోయింది. ఇతర గ్రామస్థులు ఆమెను మెట్ల వైపు పరుగెత్తమని చెప్పారని ఏబీపీ న్యూస్ తెలిపింది. ఆమె కోతుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది, కానీ జంతువులు దూకుడుగా దూకడంతో అది సాధ్యం కాలేదు.
భయంతో ఆమె బిల్డింగ్ అంచులకు వెళ్లగా ఓ కోతి కిందకు తోసేసింది. దీంతో ఆమె తల, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ప్రియ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బాధితురాలి కుటుంబీకులు ఆమెను చికిత్స కోసం శివన్ సదర్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. పోస్ట్‌మార్టం పరీక్షకు బాధితురాలి కుటుంబం నిరాకరించిందని స్థానిక పోలీసులు ఛానెల్‌కు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కోతుల బెడద విపరీతంగా ఉంది.